కదిరిలో ఎస్పీ క్షేత్రస్థాయి పరిశీలన.. మత పెద్దలతో సమావేశం
కదిరి, (అమరావతి వెలుగు): వినాయక నిమజ్జన మహోత్సవం ప్రశాంతంగా జరిగేలా పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్. సతీష్‌కుమార్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. కదిరి పట్టణంలో ఈ నెల 20న నిర్వహించనున్న నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.
మదనపల్లి రహదారి వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రాంతంతో పాటు ఊరేగింపు మార్గాలు, సున్నిత ప్రాంతాలు, నిమజ్జన పాయింట్లను ఎస్పీ పరిశీలించారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల నిఘాపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మసీదులో ప్రార్థనలు
అనంతరం ఎస్పీ మసీదును సందర్శించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. మత పెద్దలతో సమావేశమై వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగేందుకు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ప్రార్థన సమయంలో మసీదుకు వచ్చి పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు.
కదిరిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు అందరికీ సుపరిచితులేనని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని మత పెద్దలకు సూచించారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని, సున్నిత ప్రాంతాలు, నిమజ్జన పాయింట్లపై సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండి సమర్థంగా విధులు నిర్వహించాలని సూచించారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు కదిరి పట్టణ ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు.
కార్యక్రమంలో డీఎస్పీలు శివనారాయణస్వామి, శ్రీనివాసులు, సీఐలు వెంకటేశ్వర్లు, నిరంజన్‌రెడ్డి, ఆంజనేయులు, ఆర్ఐ వలి, ఎస్సైలు బాబ్జాన్, ధనుంజయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.