Amaravathi Velugu
Date of Publish : 26/10/2026, 6:36 pm
Published by Janapati Venkata Ramesh Babu

కుటుంబ సభ్యుడిగా భావిస్తాం.. గెలిపిస్తాం!

  • క్యాడర్‌కు ఎమ్మెల్యే కందికుంట భరోసా
  • నల్లచెరువు జెడ్పీటీసీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌తో భేటీ

కదిరి (అమరావతి వెలుగు): నల్లచెరువు మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌ను కుటుంబ సభ్యుడిగా భావించి గెలిపించుకుంటామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భరోసా ఇచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోమవారం కదిరిలోని పీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పరిటాల శ్రీరామ్‌తో కలిసి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివంగత నేత పరిటాల రవీంద్రతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిటాల రవీంద్ర తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని తెలిపారు. అనంతరం ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్‌కు అండగా నిలిచే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తమపై నమ్మకంతో శ్రీరామ్ నల్లచెరువు మండలం నుంచి పోటీకి దిగుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఆయన విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అండగా నిలిచిన కందికుంట

పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను చిన్నాన్నగా భావిస్తానన్నారు. నల్లచెరువు మండలం నుంచి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేయాలనే తన ఆలోచనను ఆయన దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి దిశానిర్దేశం చేస్తూ అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, నల్లచెరువు మండల కన్వీనర్ రాజశేఖర్, నాగభూషణం, వాల్మీకి స్కూల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save