కదిరి: పట్టణ అభివృద్ధికి అండగా నిలవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. కదిరి మున్సిపాలిటీలోని 34, 35, 31వ వార్డుల్లో గురువారం కూటమి అభ్యర్థుల తరఫున ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రజలు నాయకులకు స్వాగతం పలికారు. జై టీడీపీ.. జై కందికుంట నినాదాలతో వార్డులు మార్మోగాయి.
ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
నవంబరు 1న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ అర్షియా భానుతో పాటు మూడు వార్డుల అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుడు చెంచయ్య నాయుడు, మొగల్ ఫారూఖ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.