Amaravathi Velugu
Date of Publish : 31/10/2026, 8:01 pm
Published by Janapati Venkata Ramesh Babu

అక్రమ అరెస్టులు, నోటీసులకు భయపడేది లేదు

  • ఓటమి భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని కక్ష రాజకీయాలు
  • రుస్తుం మైన్‌తో సంబంధం లేదని ప్రమాణానికి సిద్ధం.. సోమిరెడ్డి సిద్ధమా?
  • మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమైన వాకాటి దంపతులు

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు*: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. అక్రమ కేసులు, అరెస్టులు, పోలీసు నోటీసులతో భయపెట్టాలని చూస్తే బెదిరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పొదలకూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌సీపీ మాజీ ఉపసర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి, బిట్‌–2 ఎంపీటీసీ అభ్యర్థి వాకాటి సంధ్య, నాయకుడు వాకాటి శివారెడ్డి తదితరులు మాట్లాడారు.

ఎన్నికల్లో పోటీ చేస్తేనే నోటీసులా?: వాకాటి శ్రీనివాసులరెడ్డి

వైఎస్సార్‌సీపీ మాజీ ఉపసర్పంచ్ వాకాటి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తన సతీమణి వాకాటి సంధ్య ఎంపీటీసీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడంతోనే పోలీసులు నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. ఇన్ని రోజులుగా గుర్తుకురాని అంశాలు ఎన్నికల సమయంలోనే గుర్తుకువచ్చాయా అని ప్రశ్నించారు. తమ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తన సోదరుడు వాకాటి శివారెడ్డిని 60 రోజులపాటు జైల్లో ఉంచారని, అయినప్పటికీ అక్రమ అరెస్టులకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ శ్రీనివాసులరెడ్డి, ఆయన సతీమణి వాకాటి సంధ్య మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు.

సోమిరెడ్డి.. ప్రమాణానికి సిద్ధమా?: వాకాటి శివారెడ్డి

వైఎస్సార్‌సీపీ నాయకుడు వాకాటి శివారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే సోమిరెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. రుస్తుం మైన్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంపై వినాయకుడి ప్రతిమ ఎదుట కుటుంబసమేతంగా ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రుస్తుం మైన్ నిర్వాహకుల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోలేదని సోమిరెడ్డి ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

మీ తాటాకు చప్పుళ్లకు భయపడం: అంజాద్

వైఎస్సార్‌సీపీ నాయకుడు అంజాద్ మాట్లాడుతూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆశీస్సులు, పొదలకూరు ప్రజలకు వైఎస్సార్‌సీపీపై ఉన్న అభిమానమే తమకు కొండంత అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. దమ్ముంటే పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయకుండా నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్యే సోమిరెడ్డికి సవాల్ విసిరారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. సర్వేపల్లి ప్రజలు మరోసారి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే సోమిరెడ్డి పోలీసులను అడ్డుపెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలకు తెరతీశారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజాబలంతో ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save