Amaravathi Velugu
Date of Publish : 08/11/2026, 6:45 pm
Published by chalapathi

బాణాసంచా దుకాణాలకు.. నిబంధనలు ఏవీ?

  • టపాసుల కంటే.. ధరల పేలుడు!
  • భద్రతా ఏర్పాట్లపై కనిపించని పర్యవేక్షణ
  • అగ్నిమాపక వాహనం లేకుండానే విక్రయాలు?

కదిరి: దీపావళి పండుగ వేళ కదిరి పట్టణంలో బాణాసంచా విక్రయాలు జోరందుకున్నాయి. స్థానిక బాలుర జూనియర్ కళాశాల మైదానంలో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి టపాసులు విక్రయిస్తున్నారు. అయితే కొనుగోలుదారుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల అమలుపై అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన వెంటనే దీపావళి పండుగ రావడంతో బాణాసంచా వ్యాపారం ఊపందుకుంది. కొనుగోళ్లకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అయితే తాత్కాలిక ట్రేడ్‌ లైసెన్సులతో పాటు దుకాణాల వద్ద తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి దుకాణం వద్ద రెండు నుంచి నాలుగు బకెట్ల ఇసుక, మట్టి కుప్పలు, నీటితో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అవి కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు.ముఖ్యంగా అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఫైర్‌ ఇంజిన్‌ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. అయితే మైదానం వద్ద అగ్నిమాపక వాహనం కనిపించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టపాసుల ధరలు కూడా భారీగా ఉండటంతో కొనుగోలుదారులకు అదనపు భారం తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save