Amaravathi Velugu
Date of Publish : 14/11/2026, 7:21 pm
Published by D BHASKAR

మత సామరస్యానికి మానవత్వమే ప్రతీక.

  • అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం పంపిణీ చేసిన ముస్లిం సోదరుడు.
  • 500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ.
  • షేక్ మస్తాన్ సేవాభావానికి అభినందనలు.

అమరావతి వెలుగు 

పొదలకూరు ప్రతినిది భాస్కర్ దేవరకొండ

పొదలకూరు:* మతాలు వేరైనా మానవత్వం ఒక్కటేనని చాటుతూ ఓ ముస్లిం సోదరుడు అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు. పొదలకూరు వినాయక మాన్యం కాలనీకి చెందిన షేక్ మస్తాన్ (సెంట్రింగ్ మస్తాన్) శనివారం సుమారు 500 మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం పంపిణీ చేసి తన సేవాభావాన్ని చాటుకున్నారు.

పొదలకూరులోని విఘ్నేశ్వర, కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం అన్నప్రసాదం అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తొలుత అయ్యప్ప స్వామికి అన్నప్రసాదం సమర్పించి, అనంతరం భక్తులకు వితరణ చేశారు. కులమతాలకు అతీతంగా భక్తులకు అన్నదానం చేయడం ద్వారా షేక్ మస్తాన్ ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా శబరిమల అయ్యప్ప సేవా సమాజం దక్షిణాది ప్రాంత అధ్యక్షుడు చొప్పా వెంకటేశ్వర్లు (చిరు) స్వామి మాట్లాడుతూ.. అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులు వివిధ పనుల నిమిత్తం సమయానికి భిక్ష స్వీకరించలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి కార్తీక మాసంలో నిత్య అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దాతల సహకారంతో అయ్యప్ప సేవా సమాజం పొదలకూరు శాఖ ఆధ్వర్యంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు అయ్యప్ప, గోవింద, శివమాల ధరించిన భక్తులందరికీ అన్నప్రసాదం అందిస్తున్నట్లు వివరించారు. ఈ సేవా కార్యక్రమం డిసెంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతుందని, మండలంలోని అయ్యప్ప స్వాములందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్నప్రసాద కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరిపై అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలు ఉండాలని ప్రార్థించారు. అన్నప్రసాద ఉభయకర్త షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం అందించే పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా స్వాములకు అన్నప్రసాదం అందిస్తున్నానని, భవిష్యత్తులోనూ అయ్యప్ప స్వామి సేవలో భాగస్వామిగా కొనసాగుతానని తెలిపారు.

 🕉️స్వామియే శరణం అయ్యప్ప!

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save