Amaravathi Velugu
Date of Publish : 16/11/2026, 7:05 pm
Published by chalapathi

పర్యాటక కేంద్రంగా కదిరి నియోజకవర్గం

  • రోడ్డు విస్తరణ పనులు నిబంధనల ప్రకారమే చేపడతాం
  • టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే కందికుంట

కదిరి, నవంబర్ 16(అమరావతి వెలుగు): పట్టణ అభివృద్ధితోపాటు నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలను అనుసంధానించి టూరిజం సర్క్యూట్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ తెలిపారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల విస్తరణ పనులు చేపడతామన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే పనులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం కదిరి మున్సిపల్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో తిరుమాడవీధుల రోడ్డు విస్తరణ, కదిరి కొండ (సొత్రాద్రి) గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించే అంశాలపై చర్చించారు.

ఆక్రమణల తొలగింపు చట్టప్రకారం

తిరుమాడవీధులు, జీవిమాను సర్కిల్‌, ఇక్బాల్‌ రోడ్డు ప్రాంతాల్లో రహదారుల విస్తరణపై ఎమ్మెల్యే అధికారులతో సమీక్షించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకున్నారు. రహదారుల విస్తరణలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆక్రమణలను చట్టప్రకారం తొలగిస్తామన్నారు. అర్హులైన వారికి న్యాయబద్ధంగా పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రతి కుటుంబం సమస్యను పరిగణనలోకి తీసుకుంటామని, స్థానికులతో చర్చించి వారి సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామన్నారు.

పర్యాటక ప్రాంతాల అనుసంధానం

కదిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతోపాటు నియోజకవర్గంలోని పర్యాటక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలను అనుసంధానిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మెరుగైన రహదారులు, మౌలిక సదుపాయాల కల్పనతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. పట్టణ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఎన్‌హెచ్‌ ఎస్‌ఈ సంజీవ్‌నాయుడు, మున్సిపల్‌ అధికారులు, టీడీపీ నాయకుడు మొగల్‌ ఫారూఖ్‌, పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu

EDITOR : Janapati Venkata Ramesh Babu

PDF Share Save