Amaravathi Velugu
Date of Publish : 16/10/2026, 7:34 pm
Published by Janapati Venkata Ramesh Babu

రూబియో పర్యటనకు ముందే రచ్చ.. జైశంకర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో దుమారం

  • విదేశాంగ మంత్రి జైశంకర్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకున్న రాహుల్ గాంధీ
  • ‘రూబియో సిబ్బంది’ అంటూ ఎక్స్‌లో వ్యంగ్యాస్త్రాలు
  • విదేశాంగ శాఖలో గందరగోళం నెలకొందంటూ కేంద్రంపై విమర్శలు
  • అమెరికా మంత్రి పర్యటనకు ముందే వేడెక్కిన రాజకీయ వాతావరణం

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటనకు ముందే రాజకీయ వివాదం మొదలైంది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ తన వ్యాఖ్యల్లో జైశంకర్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, పరోక్షంగా ఆయనను ఉద్దేశించే మాట్లాడారని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వచ్చే వారం భారత్‌లో పర్యటించనున్న మార్కో రూబియో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ యూనిట్‌ను సందర్శించడంతో పాటు ముంబైలో పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో జైశంకర్ కూడా పాల్గొంటారని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. “రూబియో తన సిబ్బందిని ముంబైకి రమ్మని ఆదేశించారు. మోదీ గారూ.. విదేశాంగ శాఖలో మీ అధికారులకు ఏం జరుగుతుందో తెలియక గందరగోళంగా ఉంది. వారికి మీరైనా వివరించండి.. లేదా నన్ను చెప్పమంటారా?” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఒక దేశ విదేశాంగ మంత్రిని మరో దేశ మంత్రికి చెందిన సిబ్బందిగా పరోక్షంగా అభివర్ణించడం దౌత్యపరమైన హోదాను కించపరచడమేనంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో, విదేశాంగ శాఖలో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపేందుకే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రూబియో పర్యటనలో భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save