Amaravathi Velugu
Date of Publish : 16/10/2026, 7:43 pm
Published by Janapati Venkata Ramesh Babu

రెండేళ్ల బంధం నన్ను కుంగదీసింది.. రోజూ బతకడమే పోరాటమైంది: అనుపమ

  • గత రిలేషన్‌షిప్‌లో తీవ్ర మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు నటి వెల్లడి
  • నటనను వదిలేయాలనిపించిందంటూ తన బాధను పంచుకున్న అనుపమ
  • పానిక్ అటాక్స్‌, బరువు తగ్గడం, కంటి సమస్యలతో ఇబ్బందులు
  • గతాన్ని అధిగమిస్తూ కెరీర్‌పై దృష్టి సారిస్తున్నట్లు స్పష్టం

మలయాళం, తెలుగు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటి అనుపమ పరమేశ్వరన్ తన జీవితంలోని కఠినమైన దశ గురించి తాజాగా మాట్లాడారు. ‘క్రేజీ కళ్యాణం’ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, గతంలో ఒక వ్యక్తితో కొనసాగిన రెండేళ్ల ప్రేమబంధం తనపై తీవ్ర మానసిక ప్రభావం చూపిందని వెల్లడించారు. ఆ సమయంలో తన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు వ్యక్తిగత జీవితం, నటనా ప్రయాణం కూడా ఇబ్బందుల్లో పడినట్లు తెలిపారు.

ఆ రోజులను గుర్తుచేసుకుంటూ, అద్దంలో చూసుకున్నా తనను తాను గుర్తించలేని స్థితికి చేరుకున్నానని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఎలా గడుస్తుందోననే భయంతో జీవించాల్సి వచ్చేదని, ఒక దశలో నటనకు స్వస్తి చెప్పాలని కూడా అనిపించిందని చెప్పారు. అయినప్పటికీ, మానసికంగా ఎంతో కష్టపడుతూ షూటింగ్‌లకు హాజరయ్యానని వివరించారు. ఆ రెండేళ్లలో తాను నటించిన సినిమాల్లో తన ప్రతిభకు తగినట్లుగా రాణించలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు.

ఆ బంధం కారణంగా మానసిక ఒత్తిడితో పాటు పానిక్ అటాక్స్‌, బరువు తగ్గడం, కంటి సంబంధిత సమస్యలు ఎదురైనట్లు అనుపమ వెల్లడించారు. మొదట ప్రేమగా ప్రవర్తించి, ఆ తర్వాత కఠినంగా వ్యవహరించడం, తిరిగి క్షమాపణలు చెప్పడం వంటి పరిస్థితులు తనను మానసికంగా అలసిపోయేలా చేశాయని తెలిపారు. అయితే, తనను వేధించిన వ్యక్తి వివరాలను ఆమె వెల్లడించలేదు. ప్రస్తుతం ఆ చేదు అనుభవం నుంచి క్రమంగా బయటపడుతూ, తన జీవితాన్ని తిరిగి చక్కదిద్దుకోవడంతో పాటు కెరీర్‌పై దృష్టి పెడుతున్నట్లు అనుపమ స్పష్టం చేశారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save