Amaravathi Velugu
Date of Publish : 16/10/2026, 7:58 pm
Published by Janapati Venkata Ramesh Babu

వీరూ వారసుడి విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు!

  • వినూ మన్కడ్ ట్రోఫీలో ఆర్యవీర్ సెహ్వాగ్ సునామీ బ్యాటింగ్
  • 19 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగిన ఢిల్లీ ఓపెనర్
  • ఒత్తిడిని పక్కనపెట్టి స్వేచ్ఛగా ఆడాలన్న వీరేంద్ర సెహ్వాగ్
  • రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ సైతం అదుర్స్

భారత క్రికెట్‌లో తనదైన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు ఆర్యవీర్ సెహ్వాగ్ మరోసారి తన బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. అండర్‌-19 వన్డే టోర్నమెంట్ వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్, చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ భారీ స్కోరు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.

ఆర్యవీర్ కేవలం 143 బంతుల్లోనే 19 ఫోర్లు, 8 సిక్సర్లతో 173 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలింగ్‌ను చీల్చిచెండాడాడు. అతడి ఆటతీరులో తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు స్పష్టంగా కనిపించింది. ఇటీవల భారత అండర్‌-19 జట్టు తరఫున కూడా అరంగేట్రం చేసిన ఆర్యవీర్, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 109 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. వినూ మన్కడ్ ట్రోఫీలో ఢిల్లీ జట్టు గ్రూప్‌-ఈలో వెనుకబడినప్పటికీ, ఆర్యవీర్ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ప్రత్యేకంగా నిలుస్తోంది.

క్రికెట్ దిగ్గజం కుమారుడిగా ఆర్యవీర్‌పై అంచనాలు ఎక్కువగా ఉన్నా, వాటిని పట్టించుకోకుండా తన ఆటపై దృష్టి పెట్టాలని సెహ్వాగ్ సూచించాడు. పెద్ద స్కోర్ల గురించి ఆలోచించకుండా స్వేచ్ఛగా ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని తన కుమారుడికి చెప్పినట్లు వెల్లడించాడు. ఇదే టోర్నీలో మరో దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ కూడా కర్ణాటక అండర్‌-19 జట్టు తరఫున సత్తా చాటుతున్నాడు. ఒక సెంచరీతో పాటు కేవలం 41 బంతుల్లో 85 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. దీంతో భారత క్రికెట్‌లో దిగ్గజాల వారసుల ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save