Amaravathi Velugu
Date of Publish : 17/10/2026, 8:18 pm
Published by Janapati Venkata Ramesh Babu

ఇద్దరు కల్నల్స్ భార్యలతో ఎఫైర్.. మేజర్‌పై వేటుకు సిద్ధమైన ఆర్మీ!

  • ఇద్దరు కల్నల్స్ భార్యలతో అక్రమ సంబంధాల ఆరోపణలు ఎదుర్కొంటున్న మేజర్
  • సర్వీస్ నుంచి తొలగించేందుకు ఆర్మీ జారీ చేసిన షోకాజ్ నోటీసు
  • ఆర్మీ చర్యలను నిలిపివేయాలన్న మేజర్ పిటిషన్‌ను తోసిపుచ్చిన ట్రిబ్యునల్

భారత సైన్యంలో తీవ్ర కలకలం రేపిన ఒక కేసులో, ఇద్దరు కల్నల్స్ భార్యలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ మేజర్‌కు ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్ (ఏఎఫ్‌టీ)లో చుక్కెదురైంది. తనను సర్వీస్ నుంచి తొలగించేందుకు సైన్యం ప్రారంభించిన పరిపాలనాపరమైన చర్యలను నిలిపివేయాలంటూ మేజర్ దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రైబ్యునల్ తిరస్కరించింది. ఈ నిర్ణయంతో మేజర్‌ను సర్వీస్ నుంచి తొలగించే ప్రక్రియకు మార్గం సుగమమైంది.

వివరాల్లోకి వెళితే... 11వ ఆర్మ్డ్ రెజిమెంట్‌కు చెందిన ఓ మేజర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు సీనియర్ అధికారుల (కల్నల్స్) భార్యలతో అక్రమ సంబంధాలు నెరపడం, నిషేధిత యాప్స్ వాడటం, అధికారులను తప్పుదోవ పట్టించడం వంటి అభియోగాలు అతనిపై నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై తొలుత 2023 అక్టోబర్‌లో మేజర్ భార్యే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది.

ఈ ఫిర్యాదు ఆధారంగా సైన్యం కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ (CoI) ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం ఆరోపణలలో వాస్తవం ఉందని తేలడంతో, ఈ ఏడాది ఆగస్టులో ఆర్మీ చీఫ్ ఆ మేజర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. కోర్ట్ మార్షల్ విచారణ అనవసరం... ఆ అధికారిని సర్వీసులో కొనసాగించాల్సిన అవసరం లేదని నోటీసులో పేర్కొన్నారు.

ఆర్మీ చర్యలను సవాలు చేస్తూ మేజర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ రాజేంద్ర మీనన్, లెఫ్టినెంట్ జనరల్ సీపీ మహంతిలతో కూడిన ధర్మాసనం, సైన్యం తీసుకుంటున్న చర్యలను నిలిపివేయడానికి నిరాకరించింది. షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వాలని మేజర్‌ను ఆదేశిస్తూ, అతడి వాదనలు వినిపించడానికి అవసరమైన పత్రాలను అందించాలని ఆర్మీకి సూచించింది. మేజర్ తన సమాధానం సమర్పించిన తర్వాత, అతడిని సర్వీస్ నుంచి తొలగించడంపై సైన్యం తుది నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఈ ఏడాది మార్చిలోనే మేజర్, అతని భార్య పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save