Amaravathi Velugu
Date of Publish : 22/10/2026, 1:42 pm
Published by Janapati Venkata Ramesh Babu

విజయసాయి రెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి

  • తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ఆహ్వానం
  • జగన్‌తో విభేదించిన ఇద్దరు నేతల భేటీతో మొదలైన చర్చ
  • భవిష్యత్తులో ఇద్దరూ కలిసి పనిచేస్తారనే ఊహాగానాలు

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో వైసీపీలో కీలక నేతలుగా పని చేసి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి రాజకీయంగా దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

బుధవారం విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్లిన షర్మిల, తన కుమార్తె అంజలి వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. కుటుంబసమేతంగా వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ జరిగింది. షర్మిల ఉద్దేశం వివాహ ఆహ్వానం అందజేయడం అయినప్పటికీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

విజయసాయి రెడ్డి వైసీపీని వీడిన తర్వాత జగన్‌మోహన్ రెడ్డిపైనా, ఆ పార్టీ విధానాలపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిజమైన రెడ్డి సామాజికవర్గానికి న్యాయం జరగలేదని ఆరోపిస్తూ, త్వరలో కొత్త పార్టీ పెట్టనున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.

కాగా, షర్మిల అందించిన వెడ్డింగ్ ఇన్విటేషన్‌పై విజయసాయి ఎక్స్ వేదికగా స్పందించారు. "డాక్టర్‌ వైయస్సార్‌గారి మనుమరాలు, శ్రీమతి షర్మిలమ్మ కుమార్తె అయిన “చిరంజీవి అంజిలి”  “Wedding Invitation” ఇచ్చి కుటుంబ సమేతంగా వచ్చి వధూవరులను ఆశీర్వదించాల్సిందిగా శ్రీమతి షర్మిలమ్మ ఈరోజు ఆహ్వానించారు" అని విజయసాయి పేర్కొన్నారు.

Scan to read onlineOpen the camera and scan the codeAll Rights Reserved By Amaravathi Velugu
PDF Share Save