
పదో తరగతి, ఇంటర్ మీడియట్ చదివే విద్యార్థులకు భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ శుభవార్త చెప్పింది. ఏడాదికి రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వరకు ఉపకారవేతనలు ఇవ్వాలని నిర్ణయించింది. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చింది. మరి ఈ ఎల్ఐసీ ఉపకారవేతనలు పొందేందుకు ఉన్న అర్హతల గురించిన వివరాలు తెలుసుకుందాం.
LIC Scholarship: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ప్రతిభావంతులైన, పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పథకం 2026 (LIC Golden Jubilee Scholarship Scheme) ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎంపికైన విద్యార్థులకు వారి కోర్సును బట్టి ఏడాదికి రూ. 15 వేల నుంచి రూ. 50 వేల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఆ స్కాలర్ షిప్ పొందాలనుకునే విద్యార్థులు ఈ నెల సెప్టెంబర్ 30వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
10వ తరగతి లేదా ఇంటర్మీడియా పూర్తి చేసుకుని మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లేదా ఒకేషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు ఈ ఆర్థిక సహాయం పొందడానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు ఎల్ఐసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్‌షిప్ పొందడానికి 10వ తరగతి లేదా 12వ తరగతి పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్ షిప్ అందిస్తున్నారు. వీరు పదో తరగతి తర్వాతా ప్లస్ 2 లేదా ఒకేషనల్ కోర్సుల్లో జాయిన్ అయితే కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2,50,000 మించకూడదు.
స్కాలర్‌షిప్ వివరాలు ఇలా
- ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ వంటి మెడిసిన్ కోర్సుల్లో చేరిన వారికి ఏడాదికి రూ. 50 వేల చొప్పున అందిస్తారు. ఇవి 3 విడతల్లో విద్యార్థులకు అందుతాయి.
- బీఈ, బీటెక్ వంటి ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే వారికి ఏడాదికి రూ. 30 వేలు ఇస్తారు.
- జనరల్ డిగ్రీ, ఐటీఐ, డిప్లొమాలో చేరే వారికి ఏడాదికి రూ. 20 వేలు అందిస్తారు.
- స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ అయితే ఏడాదికి రూ. 15 వేల చొప్పున ఇస్తారు.
దరఖాస్తు ప్రక్రియ, డాక్యుమెంట్లు
కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్ఐసీ అధికారిక పోర్టల్ licindia.inను సందర్శించి సంబంధిత ఫారమ్ నింపాల్సి ఉంటుంది. 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల మెమో, కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, ప్రస్తుతం చదువుతున్న కళాశాల ఫీజు రశీదు, ఐడీ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్‌బుక్ వివరాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని వివరాలతో ఎల్ఐసీ అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేసి కోర్సు పూర్తయ్యే వరకు స్కాలర్ షిప్ అందిస్తారు.








