
*గడ్డి విత్తనాలు చల్లుతున్న ఎమ్మెల్యే కందికుంట
తనకల్లు, (అమరావతి వెలుగు): ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా చెరువులు, కుంటలు అడుగంటి పోయాయి. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో వర్షాభావ ఆధారిత రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పాడి రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా శుక్రవారం తనకల్లు మండలం చెక్కవారిపల్లి చెరువు పరిధిలో సుమారు 100 ఎకరాల్లో సామూహిక పశుగ్రాసం పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పశుగ్రాసం గడ్డి విత్తనాలను చల్లారు.
పశుగ్రాసం కొరత లేకుండా పాడి రైతుల పశుసంపదను సంరక్షించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పాడి రైతుల జీవనోపాధి మెరుగుపడేలా అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాడి రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.








