యువ క్రికెటర్లు ఉపయోగించుకోవాలి

  • హిందూపురం క్రీడా సంస్కృతికి నిలయం
  • అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలి
  • – మచ్చా రామలింగారెడ్డి, ఛైర్మన్, క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ, RDT

అనంతపురము, 18 సెప్టెంబర్ 2026 : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఆసక్తికర యువ క్రికెటర్లందరూ ఆర్డిటి క్రికెట్ టాలెంట్ కార్యక్రమంలో పాల్గొని ఉపయోగించుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లు ఉన్నారని వారిని గుర్తించి ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని యువ క్రికెటర్లకు ఇది ఒక వరం లాంటిది అని మచ్చా రామలింగారెడ్డి చైర్మన్ ఆర్డిటి క్రికెట్ డెవలప్మెంట్ కమిటీ అన్నారుగ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రికెటర్లను గుర్తించి, వారి ప్రతిభను అభివృద్ధి చేసి, వారికి ప్రోత్సాహం అందించేందుకు రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో క్రికెట్ ఎంపిక కార్యక్రమం నిర్వహించారు.

ఈ ఎంపిక కార్యక్రమానికి RDT క్రికెట్ డెవలప్‌మెంట్ కమిటీ ఛైర్మన్ మచ్చా రామలింగారెడ్డి, హిందూపురం క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షుడు మరియు మాజీ మున్సిపల్ ఛైర్మన్ బి.ఎస్. విద్యాసాగర్, హిందూపురం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దీపక్, బీసీసీఐ అంపైర్ అన్సర్ ఖాన్, ఆర్డిటి ఏపీసి జయచంద్రారెడ్డి, సీనియర్ క్రీడాకారులు బాబ్జీ, భాస్కర్, సెలెక్టర్లు సి. వెంకటేష్, యోగానంద, విజయ్ రాజు, ఆర్డిటి కోఆర్డినేటర్ ప్రవీణ్, కోచ్ సల్మాన్ పాల్గొన్నారు.

ఈ ఎంపిక కార్యక్రమంలో మొత్తం 86 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ, హిందూపురం క్రీడా సాంస్కృతికి నిలయమని గ్రామీణ ప్రాంతాల్లోని క్రికెట్ ప్రతిభను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించడం ఆర్డిటి లక్ష్యమని తెలిపారు. అనంతపురం ప్రాంతంలో శిక్షణ శిబిరాలు, మ్యాచ్‌లు నిర్వహించడం ద్వారా గ్రామీణ యువ క్రీడాకారుల నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఆర్డిటి కృషి చేస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

బి.ఎస్. విద్యాసాగర్ మాట్లాడుతూ, పెనుకొండ ప్రాంతానికి చాలా కాలం నుంచే గొప్ప క్రీడా సంస్కృతి ఉందని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో యువ క్రీడాకారులు హైస్కూల్ స్థాయిలో అందుబాటులో ఉన్న క్రీడా మైదానాలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి RDT చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని విద్యాసాగర్ తెలిపారు. మోంచో ఫెర్రర్ క్రీడలపై ఎంతో ఆసక్తి, అభిరుచి కలిగిన వ్యక్తి అని, అనంతపురం మరియు సత్యసాయి జిల్లాల్లో క్రీడల అభివృద్ధికి అద్భుతమైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ ఒక మంచి కార్యక్రమమని ఆయన అన్నారు.

హిందూపురానికి ఉన్న క్రికెట్ చరిత్రను కూడా విద్యాసాగర్ గుర్తుచేశారు. 1961, 1989 సంవత్సరాల్లో హిందూపురంలో అనేక అంతర్రాష్ట్ర క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించామని, ఆ మ్యాచ్‌లలో రాహుల్ ద్రావిడ్, ఆశిష్ కపూర్ వంటి ప్రముఖ క్రికెటర్లు కూడా పాల్గొన్నారని తెలిపారు.
రూరల్ క్రికెట్ టాలెంట్ హంట్ ఎంపిక ప్రక్రియ ప్రారంభమైందని, గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రికెటర్లకు తమ ప్రతిభను ప్రదర్శించి, క్రికెట్‌లో ముందుకు సాగేందుకు ఇది మంచి అవకాశమని నిర్వాహకులు తెలిపారు.