విధేయతకే సర్పంచి పీఠం..!

- బ్రాహ్మణపల్లిలో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ
- పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రాధాన్యమివ్వాలి
- సామర్థ్యం, ప్రజాదరణే విజయానికి కీలకం
కదిరి, నవంబర్ 16 (అమరావతి వెలుగు):- మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో పార్టీ పట్ల విధేయతకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీలకు పలు పాఠాలు నేర్పుతున్నాయి. ఈ నేపథ్యంలో కదిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీలో సర్పంచి అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారింది.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో పార్టీకి చేసిన సేవలు, ప్రజల్లో ఉన్న ఆదరణ, నాయకత్వ సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో వెంకటేష్ చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌమ్య స్వభావం, పార్టీ పట్ల నిబద్ధత, కార్యకర్తలతో సత్సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేసిన ఆయనకు అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.
పంచాయతీ పరిధిలో ప్రజలకు అందాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై అవగాహన కలిగిన నాయకత్వం అవసరమని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పార్టీ సిద్ధాంతాలు, విలువలకు కట్టుబడి పనిచేసే వారిని ప్రోత్సహిస్తే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బ్రాహ్మణపల్లి సర్పంచి అభ్యర్థిగా వెంకటేష్ చౌదరికి అవకాశం దక్కుతుందా? పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి :: పర్యాటక కేంద్రంగా కదిరి నియోజకవర్గం











