డబ్బులివ్వలేదని కన్నతల్లిపై గొడ్డలితో దాడి!

- అప్పులు తీర్చేందుకు, మద్యం కోసం వేధింపులు తీవ్రగాయాలతో ఆసుపత్రికి తరలింపు.. కుమారుడిపై కేసు
కదిరి, నవంబరు 16 (అమరావతి వెలుగు): అప్పులు తీర్చేందుకు, మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిపైనే కుమారుడు గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లి తీవ్రంగా గాయపడింది. కదిరి పట్టణంలోని కుటాగుళ్ల దర్గా వీధికి చెందిన సంకేపల్లి మహబూబ్ జాన్ (57) చింతపండు గోడౌన్‌లో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె పెద్ద కుమారుడు బాబ్జాన్ మద్యానికి బానిసై అప్పులు తీర్చేందుకు, మద్యం కొనుగోలుకు డబ్బులు ఇవ్వాలని వారం రోజులుగా తల్లిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మహబూబ్ జాన్ గోడౌన్‌లో పనిచేస్తుండగా బాబ్జాన్ అక్కడికి వచ్చాడు. డబ్బుల విషయమై తల్లితో గొడవపడి గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆమెను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.గోడౌన్ యజమాని షేక్ ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలోనే అతడిని అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: విధేయతకే సర్పంచి పీఠం..!











